పుట:మధుర గీతికలు.pdf/377

ఈ పుట ఆమోదించబడ్డది


కాంచినంతనే తోక యాడించుకొంచు
మీఁది కెగఁబ్రాకు ప్రేమతో నాదుకుక్క;
పిలిచినంతనె నా చేతివ్రేలిమీఁద
వాలిపులుఁగులు కిలకిల పాడుచుండు.

ఏను గ్రామాంతరంబున కేగునపుడు
అచటి మేడలు సొగసైన వైన నేమి-
మరల నా పూరిగుడిసెకు నరుగు టెపుడొ
అనుచు నామది తహతహలాడుచుండు.

ఎప్పు డేవీథి నేగిన నెలమి మీఱ
పలుకరింతురు నను జూచి పౌరు లెల్ల;
ఎన్న ‘తా నున్న యూరును, తన్ను గన్న
తల్లి యొకరీతి' యని యందు రెల్లవారు.