పుట:మధుర గీతికలు.pdf/375

ఈ పుట ఆమోదించబడ్డది


అచట నిచ్చలు నిత్యకల్యాణములును
పచ్చతోరణములు నయి వరలుచుండు;
స్వర్గమునకన్న, నను గన్న జననికన్న
స్వర్గమంగళకరము నా జన్మభూమి.

అవనిలో నున్న యన్ని వస్తువులకన్న
నిన్నె ప్రేమింతు మిన్నగా కన్నతల్లి !
కామితార్థము లొనగూర్చు కల్పవల్లి !
సకలసుఖముల వెల్లి ! నా జన్మభూమి.

నిన్ను ప్రేమించు నా ప్రేమ నిర్మలంబు,
నిరుపమానము, నిత్యంబు, నిబ్బరంబు;
నిన్ను సేవించు నా సేవ నిశ్చలంబు,
నిర్నిరోధము, నిద్దంబు, నిట్టలంబు.

పరులు నీపయి దండెత్తి వచ్చిరేని,
వారితోఁ బోరి యవలికిఁ బారఁద్రోల
నాదు ప్రాణము మానంబు నా ధనంబు
నర్పణ మొనర్చి ధన్యుండ నగుదు నేను.

2