పుట:మధుర గీతికలు.pdf/367

ఈ పుట ఆమోదించబడ్డది


శ్వాస మరికట్టె, గుండియ జల్లు రనియె
ముమ్మరమ్ముగ చెమ్మటల్ గ్రమ్మె మేన;
అంతరాళమునం దామె యెంత సేపు
వ్రేలియాడుచు నారీతి తాళఁగలదు ?

కొట్ట నిచ్చున గంటను ? పట్టుకొనున ?
అదియు నిది గాక, సత్తువ ప్రిదులువడఁగ
పట్టు విడి నేలఁ గూలున పడఁతి ? యకట !
ఏది జరుగంగ నుండెనో యెవరి కెఱుక ?

వెంటనే యామెకన్నుల వింతకాంతి
తళుకు లీస, తటాలున తాల్మి నూని
పైకి గుప్పించి గంటను పట్టుకొనియె,
త్రాణ యేటనుండి పచ్చెనో తరుణి కపుడు ?

మొగము బిగియించి కనుబొమల్ ముడివడంగ
సువిచ యిట్లనె హుమ్మని హుంకరించి,
"ఏది యెటులైనఁ గానిమ్ము నాదు ప్రతిన
యిదియె, యీ రేయి గంట వాయింపనీయ"

60