పుట:మధుర గీతికలు.pdf/364

ఈ పుట ఆమోదించబడ్డది


ఇంతి యచ్చట గంట వాయించువాని
తోడనిట్లనె పెదవులు తొట్రువడఁగ,
“అన్న! అల్లదె కారాగృహంబునందు
బంధియై యుండె నా కూర్మిబందు గొకఁడు

చల్లకై వచ్చి ముంత దాచంగ నేల ?
ఆతఁడే నాదు చిన్నారి యనుపుకాఁడు;
నృపుని శాసనమునఁ జేసి నేఁటిరాత్రి
గంట మ్రోయంగనే వాని కంఠ మెగయు

చెప్ప నేటికి ? - వాని రక్షించువాఁడు
ఈవు, దేవుఁడు తక్క నిం కెవఁడు లేఁడు,
ఈ దినంబున గంట వాయింప మాని
ప్రేమతో నాకు పతిభిక్ష పెట్టు మయ్య."

"చిన్నతనముననుండి యో యన్ను మిన్న !
ప్రభునియుప్పును తిని నేను బ్రదుకుచుంటి
నేఁడు డెబ్బదియేఁడుల వాడనైతి
ఱేనియాసతి యేగతి మానువాఁడ ?

57