పుట:మధుర గీతికలు.pdf/362

ఈ పుట ఆమోదించబడ్డది


"భళిర ! సాలీఁడ ! నీపూన్కి ఫలము నొందె,
ధృతి దొలంగక నీవలె నేను గూడ
విజయలక్ష్మి వరించెద వేడ్కమీఱ"
అనుచు నెలుఁగెత్తి యఱిముఱి నఱచె ఱేఁడు.

కొంతకాలము గడచినయంత, నతఁడు
చెల్లచెద రైన సేనల నెల్లఁ జేర్చి
శత్రువులతోడ డీకొని జయము గాంచి
తనదు ప్రజలకు స్వాతంత్య్రమును ఘటించె.

కార్య మేదైన సాధింపఁ గడఁగువారు
బ్రూసు సాలీని కత జ్ఞప్తి చేసికొనుచ్చు
పెక్కుబన్నంబు లొదవిన లెక్కగొనక
కార్యసాఫల్య మగుదాఁకఁ గడఁగవలయు.

55