పుట:మధుర గీతికలు.pdf/361

ఈ పుట ఆమోదించబడ్డది


మగుడ దిగజాఱి సాలీఁడు దిగువఁ బడియె,
తోడనే యొక్కదూఁకున దుమికె పైకి;
పైకి క్రిందికి క్రిందికి పైకి, నిట్లు
బంతి మీటినగతి సారె గంతులిడియె.

ఏల కడఁగెద వింక నో సాలెపురుగ ?
వమ్ములై చనె నీ ప్రయత్నమ్ము లెల్ల .
జాతి కూలితి వింతలో నాఱుమార్లు
కటకటా! చేరఁ గలవే నీ గమ్యసీమ ?

మరల నొకసారి మీఁదికి నుఱికె పురుగు
అడుగు మాత్రమె తనగూఁటి కవధి యుండె;
జాణెనాఁ యింక తనగూఁడు చేరలేదు;
జయము నొందున? తుదిసారి జాఱిపడున ?

అల్లనల్లన క్రమముగా నడుగు లిడుచు
మీఁది కెగఁబ్రాఁకె సాలీఁడు మెల్లమెల్ల;
చంగు మని యొక్క గంతున చౌకళించి
ఎట్టకేలకు గూటియుయ్యెలను జేరె.

54