పుట:మధుర గీతికలు.pdf/360

ఈ పుట ఆమోదించబడ్డది


అరిగెనో లేదొ నాలు గై దంగుళములు -
తోడనే యది క్రిందికి తూలి జాఱె;
మరల వెంటనె మీఁదికి నురికెఁ గాని,
తొంటికంటెను క్రిందికి తూలిపడియె.

తడవుకొనకుండ, త్రుటియైన తడయకుండ
పైకి చర చర క్రమ్మఱ ప్రాఁకె చెలఁది;
ఔర ! అది యేమి ! పదములు జాఱెనేమొ.
నేలమీఁద గుబాలున కూలి పడియె.

తెప్పిఱిలి కొంతవడి కది తేఱి లేచి
తెంపుచే లేని సత్తువ తెచ్చికొనుచు
గుప్పు మని పైకి కుప్పించి కొప్పరించె,
చేవ యెటనుండి వచ్చినో చెలఁది కపుడు ?

తాఁకినంతన తెగిపోవు దార మంట,
మిగుల నెత్తైన నడికొప్పుమీఁది కంట..
గాలిచే నూఁదుకొనిపోవు సాలెపురుగు
అక్కటా ! ఎట్టు లెగఁ బ్రాకు నంతదవ్వు ?

53