పుట:మధుర గీతికలు.pdf/355

ఈ పుట ఆమోదించబడ్డది


ఱేఁడు తోడనె యావైపు దృష్ఠి బఱపె
మబ్బుమాటున చంద్ర బింబంబు వోలె
మేలిముసుఁగున నెమ్మోము మెఱుఁగు లీన
తరుణి యొక్కతె నిలుచుండె శిరము వంచి

'జయము జయ మహారాజ ! జయము జయము
దేవరకు పట్టమహిషియు, దేవి మాకు
కాఁదగిన విశ్వమోహనాకార నీమె
బందెగొని తెచ్చినారము ప్రధానికడకు

అనుచు సేనాని వచియించి యధికభక్తి
గదుర చేతులు జోడించి యొదిగి నిలిచె,
ప్రభువు తల యెత్తి యా యింతి వైపు జూచె,
జనుల కలకలారావముల్ నందడించె.

క్షణములో నొక్క పెట్టున జనులచూపు
లొక్కపరి ఱేనివైపున, నొక్కసారి
యింతివైపున త్రుళ్లింత లిడుచునుండె ;
ఉస్సు రని రాజు క్షణ మట్టె యూరకుండె

48