పుట:మధుర గీతికలు.pdf/351

ఈ పుట ఆమోదించబడ్డది


కట్ట ! ఏ మిది ? ఎంతలో నెట్టి మార్పు ?
లలిత శృంగారమున కవలంబ యైన
వనిత రౌద్రమునకు నాలవాల మగుచు
భీకరాకృతి ధరియించి భీతి గొలిపె.

కరుణ కిరవైన యా వాలుఁగన్నుదోయి
గ్రక్కుచున్నది విస్ఫులింగములనిపుడు;
మొలకనవ్వుల నొలికించి ముద్దు మొగము
కురియుచున్నది దారుణ క్రోధరసము.

అరరె ! యామె జరీలున హయము డిగ్గి
చికురములు విచ్చి పాయలై చిందలాడ,
వాలు ఝళిపించి నిష్ఠురస్వరముతోడ
నన్నె కాఁబోలు పిలుచుచునున్న దదిగొ

ఏమి యనుచుంటి ? వీవు పాటేశ్వరివియ ?
'రాజ్ఞులము మేము మేవాడురాజ్యరమకు,
ఉసురు లీ దేహమున నిల్చియుండుదాఁక
పాటిగొందుమె నీ సార్వభౌమపదవి  ?'

44