పుట:మధుర గీతికలు.pdf/348

ఈ పుట ఆమోదించబడ్డది


విశ్వ మెల్లను పాలించు విభుఁడ నయ్యు
స్వాంతమున నాకు సుంతయు శాంతి లేదు,
అందఱును నాకు శత్రులే యగుటఁ జేసి
కుదురుగా నొక్కరేయియు నిదుర వోవ

ఎలమి నీ విప్పు వాడిన పలుకులందు
అన్ని ముమ్మాటికి నిజంబె యగును గాని,
పరులు నాదగు పదవికి వాంఛ సేయ '
రనెడు వాక్య మొక్కటియె సత్యంబు గాదు.

కూర్మిమిత్రుఁడ: నీవియ్యకొంటి వేని,
రక్తిమై నాదు రాజ్య సర్వస్వ మెల్ల
నీకు నప్పస మొనరించి, నీదు పదవి
హృదయపూర్వకముగ స్వీకరించువాఁడ

రత్నమయ మగు నాదు తురాయి కంటె
బాగు మీఱిన నీ కుచ్చుపాగ మేలు;
నాడు బంగరుసింహాసనమ్ము కంటె
అలికి ముగ్గుల నిడిన యీ యరుఁగె మేలు.

41