పుట:మధుర గీతికలు.pdf/333

ఈ పుట ఆమోదించబడ్డది



"అమ్మ ! ఎన్నియొసార్లు నిన్నడుగఁ దలఁచి
నుడువఁ దలఁకితి నీ మది నొచ్చు ననుచు;
ఎవఁడు నా తండ్రి ? అతని దేమి కులము ?
నుడువుమా” యని మెల్లన నడిగె నతఁడు.

సిగ్గుచే నంత నేలకు శిరము వంచి
ఉస్సు రని యామె వేడినిట్టూర్పు పుచ్చి
గద్దదిక తొట్రుపాటును కడలుకొనఁగ
పలికె నీరీతి సన్ననియెలుఁగుతోడ.

“పేదనై జవ్వనంబున పెండ్లి లేక
పెక్కుపతుల సేవించితి స్వేచ్ఛ మీఱ ;
పొడమితివి నాఁడు నీవు నా కడుపునందు
ఎట్లు వచియింతు నీ తండ్రి యెవఁడో కుఱ్ఱ! "

సంజకడ లేచి శిష్యులు స్నానమాడి
చదువుచుండిరి గురునొద్ద శాస్త్రములను;
బాలుఁ డంతట చనుదెంచి కేలు మోడ్చి
మౌనిపాదాబ్జములకు నమస్కరించె

26