పుట:మధుర గీతికలు.pdf/331

ఈ పుట ఆమోదించబడ్డది



"సత్యకాముఁడు నాపేరు, జబల తల్లి,
బ్రహ్మవిజ్ఞానమును నేర్వ వచ్చినాఁడ;
నీదు పాదరాజీవసన్నిధిని జేర్చి
శిష్యునిఁగ నస్ను ధన్యాత్ముఁ జేయు మయ్య.

స్వచ్ఛ మగు బ్రహ్మతేజము వదనమందు
ఉట్టిపడ, నెట్టయెదుటను నిట్టనిలిచి
యున్న బాలుని బొడఁగని యోగివరుఁడు
పలికె నీరీతి కూరిమి మొలకలెత్త.

"ఈశ్వరుఁడు నీకు శుభముల నిచ్చుఁ గాక !
ఏ కులము నీది ? నీ తండ్రి యెవఁడు వత్స ?
బ్రహ్మవిజ్ఞానమును నేర్వ బ్రాహ్మణుండు
గాక యన్యుఁడు యోగ్యుండు గాఁడు సుమ్ము.

"తల్లినే కాని కూర్మితండ్రి యెవఁడొ
యింతకాలముదనక నే నెఱుఁగ నయ్య,
అమ్మకడ కేగి కులము గోత్రమ్ము నడిగి
తెలిసికొని వత్తు పంపుమా సెల వొసంగి."

24