పుట:మధుర గీతికలు.pdf/328

ఈ పుట ఆమోదించబడ్డది



విచ్చుకత్తులు చుట్టును వీఁగియాడ
బాలవీరుని వదనబింబంబు వెలనె,
వేయికరములనడుమను వెలుఁగుచున్న
చండమార్తాండబింబంబు చందమునను.

మరణదేవతా వదనగహ్వరమునందు
కొమరు మీఱఁగ బాలుండు కొలువుదీర్చి
'దండు విడిసెను రిపుసేన, లెండు రండు'
అనుచు నెలుఁగెత్తి చీరెను తనబలంబు.

శంఖరవములు, నడుగుల చప్పుడులును,
సింహనాదంబులును వాని చెవులఁ బడియె;
'పొండు, రిపుసేనలను దాఁకి పొడువుఁ' డనెడి
అట్టహాసంబు లొక పెట్ట ముట్టె మిన్ను.

తళుకుకత్తుల మెఱపులు తాండవింప
వాని నెమ్మేన నెత్తురువాన కురిసె,
భూరి గర్ణారవంబున వీరుఁ డఱచె
'దండు విడిసెను రిపుసేన, లెం' డటంచు.

21