పుట:మధుర గీతికలు.pdf/326

ఈ పుట ఆమోదించబడ్డది



ఆ ప్రశాంత విశాంతమునందు, వాని
యుల్ల మువ్విళులూరించు నూహ లెవియొ ?
తనదు జనకుని చిఱునవ్వొ, అనుఁగుజనని
కౌఁగిలింతయొ, ప్రభుని క్రేఁగంటిచూపొ ?

గౌతమీ పూతసలిలావగాహనంబొ ?
విమల కృష్ణాసరిత్తీర విహరణంబొ  ?
కేళికోద్యానవనతటీ క్రీడనంబొ ?
ఏమి తల పోయుచుండెనో యెవని కెఱుక ?

ఉన్నయటు లుండి, అక్కటా! యోధుఁ డట్టె
నిట్టనిలువున మ్రాన్పడి నిలిచె నేమి ?
పొదలమాటున నడుగు చప్పుడుల వినెన ?
దవుల నెవ్వియొ గుసగుసధ్వనుల వినెన ?

అడుగుసడి గాదు, పెనుగాలి యగ్గలించి
గుమురులై యున్న యాకుజొంపములు వీవ
అటమటించేడు రెమ్మల తటపట లవి ;
గుసగుసలు గావు, పాముల బుసబుస లవి.

19