పుట:మధుర గీతికలు.pdf/323

ఈ పుట ఆమోదించబడ్డది


అక్కటా ! ఏమి చెప్పుదు ?- నంతలోనె
బెడిద మగు భీషణధ్వని పిడుగు వోలె
ఉదధిమధ్యమునందుండి యుద్భవించి
బోరుకలఁగెను దిక్కులు మాఱుమ్రోఁగ.

బళ్లు మని యంత నా నావ బ్రద్ద లగుచు
చాపకొయ్యయు, చుక్కాని, చాపతోడ
చిదుర చిదురలై జలధివీచికలఁ దేలె
అక్కటా ! ఎందు నున్నాఁడొ యనుఁగుబిడ్డ?

కడలికడుపున నడఁగెనో? గాలిలోన
లీన మయ్యెనొ ? బాలుండు కానరాఁడు;
మిణుఁగురులఁ బోలె ధగధగ మింట మెఱయు
అగ్నికణముల నడుగుఁడీ యతనిజాడ.

దారుణం బగు నానాఁడు తరణియందు
మ్రంది రెందరో మనుజులు మంట మ్రగ్గి
నిలిచెనే వారి నామముల్ నేఁటి డనుక
ధీరుఁ డగు బాలుఁ డీతని పేరు దక్క ?

16