పుట:మధుర గీతికలు.pdf/312

ఈ పుట ఆమోదించబడ్డది



ఆడు, నేడుచు, పలవించు, పాడు, సోలు,
తేఱిపాఱగఁ దిలకించు, కేరు, నవ్వు,
గొణుఁగుఁ దనలోన, వేదురు గొన్నభంగి
నుండు; పసిపాప కేవల యోగి కాఁడె!

ఠీవి బొటవ్రేలె పిల్లనగ్రోవి గాఁగ
మోవిఁ గీలించి, యెల్లరు మోహజలధి
నోలలాడఁగ కలరవ మాలపించు
ముద్దుబిడ్డఁడు గోపాలమూర్తి కాఁడె?

తనదు నవ్యక్త మధుర గీతంబులకును
కాలుసేతుల యల్లార్పు తాళములుగ,
వెలికిలఁ బరుండి క్రీడించు బిడ్డ డెన్న
లోకకళ్యాణమునకు మాఱాకు గాఁడె ?

వెండిపళ్లెరమునయందు వెలుఁగుచున్న
కప్పురపుదీపమో యన నొప్పు మీఱు
జిలుఁగు వెల్లని దుప్పటిసెజ్జమీఁద
ఠీవిఁ గూర్చుండి క్రీడించు డింభకుండు.

5