పుట:మధుర గీతికలు.pdf/311

ఈ పుట ఆమోదించబడ్డది



వింతవస్తువొ తాయమో చెంత నిడిన
యంత, కనకాభిషేకంబు నందినట్లు
పొంగి గంతులు వైచును నింగి ముట్టు;
అల్పసంతోషి కాఁ డఁటే యర్భకుండు?

పువ్వుఁదేనెయు తావియు పుప్పొడియును
చిందకున్నను చెడకున్న చెదరకున్న,
ముద్దుబిడ్డల నవ్వుతోఁ బోల్పవచ్చు
క్రొత్తఁకా విచ్చు పున్నాగ గుచ్ఛకంబు.

కన్నె వెన్నెలకన్నను, వెన్న కన్న,
మంచుబిందులకన్న, క్రొమ్మించుకన్న,
కుసుమమకరందమునకన్న కోమలంబు
చిఱుతపాపల చిన్నారి చిన్ని నగవు.

నల్లనివి యెల్ల నీళ్లును, తెల్ల వెల్ల
పాలటంచును సూటిగా, బలుకుచుండు,
కల్లకపటంబు లెఱుఁగఁడు పిల్లవాఁడు;
బిడ్డఁ డన దేవుఁడన వేఱె భేద మున్నె

4