పుట:మధుర గీతికలు.pdf/310

ఈ పుట ఆమోదించబడ్డది

ప సి పా ప



ప్రియము గూర్తురు, కూర్పరప్రియము నెపుడు
మోదమే కాని ఖేదంబుఁ బొరయనీరు;
పెద్దవారలకంటెను పిన్నవారె
కొల్లగొందురు పితరుల యుల్లములను.

తల్లిదండ్రులు కినుకచేఁ దన్ను గొట్టఁ
దన శిరంబును వారి యక్కున గదించి
జాలి పుట్టఁగ నేడ్చెడు బాలుఁజూడ
ఉల్ల మెవ్వరి కైన రంజిల్ల కున్నె?

ఇంతలో నవ్వు, నేడుచు నంతలోనె,
ఇంతలో వేఁడు, బెదరించు నంతలోనే,
ఇంతలో నల్గు, మనసిచ్చు నంతలోనె;
చిత్రములు గావె పసిపాప చేష్ట లౌర!

3