పుట:మధుర గీతికలు.pdf/30

ఈ పుట ఆమోదించబడ్డది

19

శ్రీ శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిగారు, ముదిగంటి జగ్గన్న శాస్త్రిగారు, కృష్ణరావుగారి వీధి అరుగుపైనున్న గదులలో తమ తమ జీవనోపాధి వృత్తులను కొనసాగించుకొను చుండెడివారు ! శ్రీ మున్నంగి శర్మగారిని గౌతమీ గ్రంథాలయం క్యూరేటరుగా నియమించి వారికి తమ యింటియందే ఆశ్రయమిచ్చి యుండిరి.

ఇంక శ్రీ భావరాజు కృష్ణరావు, శ్రీ నండూరి బంగారయ్య, శ్రీ బాలదారి వీరనారాయణదేవు శ్రీ సత్యవోలు అప్పారావు. శ్రీ చెళ్లపిళ్ల వేంకటకవి, శ్రీ వడ్డాది సుబ్బరాయకవి, శ్రీ చిలకమర్తి లక్ష్మీనరసింహసుకవి, శ్రీ చిలుకూరి నారాయణరావు, శ్రీ చిలుకూరి వీరభద్రరావు మున్నగు మహనీయులు, మహా పండితులు, మహా కవులతో మొగసాల ఎప్పుడునూ కలకలలాడు చుండెడిది.


అంతే కాక బ్రహ్మ సమాజ కార్యనిర్వాహణము నందు ప్రసిద్ధులైన శ్రీ పెద్దాడ రామస్వామిగారు, శ్రీ నరహరిశెట్టి వెంకటరత్నంగారు శ్రీ అద్దేపల్లి లక్ష్మణస్వామినాయుడుగారు మున్నగు వారు శ్రీ కృష్ణరావుగారికి ఆప్తమిత్రకోటిలోనివారు.


శ్రీ నాళం కృష్ణరావుగారు నిర్వహించిన బహుముఖ సేవా రంగముల వలన వారికి రాజమహేంద్రవరము నందలి గొప్ప గొప్ప కవి పండితులతో గల స్నేహసంబంధములు సహజములైనవే. కాని ప్రపంచ ప్రఖ్యాత సంగీత కళాభిజ్ఞుడైన శ్రీ హరీంద్రనాధ్ ఛట్టోపాధ్యాయగారిని రాజమండ్రికాహ్వానించుటయే కాక, పలుమార్లు వారికి తన గృహమునందే వసతిని, ఆతిధ్యము నిచ్చి సమ్మానించి, శ్రీకృష్ణరావుగారు గౌరవించి యుండిరి.