పుట:మధుర గీతికలు.pdf/293

ఈ పుట ఆమోదించబడ్డది

యోగి - నాస్తికుఁడు


దారుణం బగు నొక్క కాంతారమందు
ఆశ్రమంబున నొకయోగి యధివసించె;
ఆతఁ డెప్పుడు తనపంక్తి నతిథి లేక
ఒక్కసారియు భుజియింపఁ డోగిరంబు.

అంత నొకనాఁటి మిట్టమధ్యాహ్న వేళ
బడుగుదేహము, వంగిననడుము గలిగి
తొంబదేడుల ముదుసలి తొక్కొకండు
అతనిగృహమున కేతెంచె నతిథి యగుచు.

అతనిరాకకు ముద మంది యతివరుండు
భక్తి మీఱఁగ పూజించి, వాని కనియె:
“స్నాన మొనరించి పిమ్మట సంధ్య వార్పు,
మిరువురము నంత భుజియింత మింపు దనర.