పుట:మధుర గీతికలు.pdf/292

ఈ పుట ఆమోదించబడ్డది


పెరుగు పడె నని యించుక యెఱుఁగ కతఁడు
'సెట్టి ! యింకను తడ వేల చేసెద ?' వన,
'సోద్దె మందుచు నుంటి నీబుద్ధి' కనుచు
నుడివి, యాసెట్టి మట్టులో నూనె పోసె.

వంటవాఁ డంత వెంటనే యింటికడకు
వచ్చి, 'పెరుగును నూనెయు తెచ్చితి' నని
నుడువ, 'పెరుఁ గేది ?' యని విప్రుఁ డడుగ 'ఇదిగొ'
యంచు నాతఁడు గిన్నె బోర్లించి చూపె.

మట్టులో నున్న చము రెల్ల మట్టిపాలు
గాఁగ, పెరుఁ గిట్టులే యయ్యెఁగాఁ దలంచి
వానిచేతకు నవ్వుచు బ్రాహ్మణుండు
'అవుర ! ఎంతటి నేర్పుకాఁడవుర ?' యనియె.

తోడనే వంటవాఁ డంత బాడబుండు
తనదు తెలివికి మెచ్చినాఁ డనుచు మదిని
వేడ్క జెందుచు, 'స్వామి ! నా వేతనంబు
వృద్ధి గావింపుఁ' డని వాని వేఁడికొనియె.