పుట:మధుర గీతికలు.pdf/291

ఈ పుట ఆమోదించబడ్డది


"నా కొసంగిన యీరెండురూకలందు
నూనె దేనికి, మజ్జిగ దేని? కనుచు
నడుగ మఱచితి నంగడి కరుగునపుడు,
తెల్లముగ దేని కేదియొ తెలుపు మయ్య.”

వాని తెలివికి నవ్వి యాబ్రాహ్మణుండు
కాసులను రెండు వేర్వేరుగా నొనర్చి,
“దీనికి పెరుంగు, దీనికి నూనె తెమ్ము”
అనుచు వచియించి కమ్మఱఁ బనిచె నతని.

వల్లె యని పల్కి యాతండు గొల్లవాని
గృహమునకు నేగి, కానికి గిన్నెలోన
పెరుగు పోయించుకొని, యంత పెద్దసెట్టి
కడకుఁ జని నూనె యిమ్మని కాని యిచ్చె.

కాని గైకొని కోమటి నూనె తూఁచి
'ఎందుబోయుదు ?' నన, నాతఁ 'డిందు బోయూ
మనుచు గిన్నెను బోర్లించి యడుగు చూప,
బొళుకు మని లోనిపెరు గెల్ల నొలికె నేల.