పుట:మధుర గీతికలు.pdf/283

ఈ పుట ఆమోదించబడ్డది


అలికిడికి నుల్కివడి, తోనె మెలకువ గని,
తలయు మొగమును చేతులఁ దడవికొనుచు
తల్లడంబును చోద్యంబు మల్లడి గొన,
మదినిఁ దలపోసె నీరీతి ముదివెలంది:

“అమ్మ చెల్లరొ! యిది యేటి యబ్బురంబొ ?
నేను నే నగుదునొ కానొ ? నేన యైన
తోక యాడించు నోకుక్క, కాకయున్న
మొఱిగి నామీఁది కొక'పెట్ట యుఱికి కఱచు."

ఇట్లు చింతించి ముదుసలి యింటి కరిగె;
బొంయి బొం యని యాకుక్క బొబ్బరించె;
ఉలికివడి యీమె వెనుకకు నోదిఁగి యొదిఁగి
'అక్కటా ! నేను నేను కా' నంచు నేడ్చె.