పుట:మధుర గీతికలు.pdf/282

ఈ పుట ఆమోదించబడ్డది

నేను నేను కాను


కేలఁ గోలయు, నెత్తిపై మీలబుట్ట
పెట్టుకొని యేగె సంతకు వృద్దురాలు;
కొంతసేపటి కాపెకు కునుకు రాఁగ,
ఒరిగె నాబాటదరి నున్న తరువుక్రింద.

బండఁ డొక్కఁడు ముదుసలియండఁ జేరి
నున్నఁగా తలవెండ్రుక లన్ని గొఱిగి
మొగముమీఁదను, తలనిండ ముగ్గుపూసి
బొగ్గుపొడితోడ నెడనెడ బొట్లు పెట్టె.

దృష్టివిడుతను బోలి వికృతము గొల్పు
యామెవదనంబు దిలకించి యక్కజమున
గుంపులుగఁ గూడి జను లెల్ల గొల్లు మంచు
కడుపు చెక్కలుగా నవ్వఁ గడఁగి రంత.