పుట:మధుర గీతికలు.pdf/28

ఈ పుట ఆమోదించబడ్డది

17

గారు, శ్రీ కృష్ణరావుగారి షష్టిపూర్తి ప్రచురణగా వీరి తక్కిన సేకరణ గ్రంథములనన్నింటిని, తెనాలి కళ్యాణి ప్రెస్సువారి సహాయముతో ముద్రణ చేయించగలనని కృష్ణరావుగారి దగ్గఱ నున్న సామెతల ఇంకొక ప్రతిని తీసుకొని వెళ్ళిరి. ఆ షష్టిపూర్తి సందర్భముగా లోకోక్తులు, జాతీయములు అను పేరుగల శ్రీకృష్ణరావుగారి ఇంకొక సేకరణ గ్రంథములను వారు ముద్రణ చేయించినారేకాని 10 వేల సామెతలేమైనవో పరమాత్మునకే ఎఱుక ?


సంపూర్ణమైన తెలుగు సాహిత్య పరిశీలనాదక్షతతో ఆంధ్రవాఙ్మయ రంగమున నిట్లు సేకరణ గ్రంథములను ప్రప్రథమముగా వెలయింపచేసిన ఖ్యాతి శ్రీకృష్ణరావుగారికే దక్కినది - ఈ సేకరణ గ్రంథములు కాక ఇంకొక అపూర్వమైన సేకరణ గ్రంథము; శ్రీకృష్ణరాయాంధ్ర సాహిత్య విజ్ఞాన సర్వస్వము! రెండువందలకు పైబడిన ప్రాచీన కావ్యముల నుండి, సుమారు వెయ్యి మకుటములతో ఉదాహరణ పూర్వకముగా ఉద్దరించబడిన ఎనిమిదివందల పుటలుకల బృహత్తర సేకరణ గ్రంథమిది ఇది వారి మరణానన్తరము వారికుమార్తెయైన శ్రీమతి ఊటుకూరి లక్ష్మికాన్తమ్మ గారిచే, ఉదారులైన దాతల ఆర్ధిక సాహాయ్యముతో ప్రచురింపబడినది. అఖిలాంధ్ర సాహిత్యమునందలి నిఖిలవస్తు విషయ వివేకము కల్గించు ఈ కృష్ణరాయాంధ్ర సాహిత్య విజ్ఞాన సర్వస్వమును బోలిన విజ్ఞానోపజ్ఞామహితమైన సాహిత్య సర్వంకషమగు గ్రంథము ఇంకేహిందూ దేశభాషల యందును వెలువడి యుండలేదనుట సత్యేతరము కాజాలదు. ఇదియొక్కటియే చాలును; శ్రీకృష్ణరావుగారికి ఆంధ్రసాహిత్యముపై నెంత అధికారముకలదో పట్టి చూపుటకు :