పుట:మధుర గీతికలు.pdf/279

ఈ పుట ఆమోదించబడ్డది

పిచ్చి కుక్క


వినుఁడు జనులార ! శ్రద్ధగా వీను లలర
చెప్పుచుంటిని మీ కొక్క చిన్నకతను;
కుఱుచ యని రక్తి యొక్కింత కొఱఁతవడదు,
చిట్టి దయ్యును మిరియంబు చెడునె ఘాటు ?

జంగ మొక్కఁడు కలఁడు కళింగపురిని,
అతని నామము 'పశుపతి' యనఁ బరంగు;
లింగపూజాధురీణుం డనంగ నతఁడు
భూతలంబున మిక్కిలి ఖ్యాతి కెక్కె.

సతత మాతఁడు కావివస్త్రములఁ దాల్చి
నుదుట వీబూదిరేకలు కుదురుగొలిపి
మెడను రుద్రాక్షమాలిక మేళవింప
అపరశంకరుఁడో యన నలరుచుండు.