పుట:మధుర గీతికలు.pdf/277

ఈ పుట ఆమోదించబడ్డది


“ఎట్టి దుర్భరరోగంబు లేని గాని,
అట్టె యవలీల కుదురఁజేయంగ నేర్తు,
లెక్కయే మూఁగతనమును చక్కఁజేయ ?
చిటికలో నామె మాటాడఁ జేయువాఁడ.”

అతని మాటల కెంతయు నాత్మ నలరి
వెంటఁ గొనె వాని బ్రాహ్మణుఁ డింటికడకు;
అంత నింతికి వైద్యుండు గొంతులోన
శస్త్ర మొనరించి రోగంబు చక్కఁజేసె.

ఏమి చిత్రమొ కాని - ఆయింతినాల్క
అంతనుండియు క్షణ మైన నాగకుండ
ఆనుక్రోవి విథంబున నల్లలాడి
వాఁగ సాగెను జేగంట మ్రోఁగినట్లు.

మగువ యంతట నిత్యంబు మగనితోడ
కడఁగి కయ్యాల క్రచ్చయై కాలు త్రవ్వి .
చీటిమాటికి జగడంబు చేయుచుండె;
గరిత కా దది గయ్యాళిగంప గాని.

20