పుట:మధుర గీతికలు.pdf/272

ఈ పుట ఆమోదించబడ్డది


'బ్రతుకు జీవుఁడ' యంచు లోపలికి నేగి
బల్లపై మేను వాలిచి వైదికుండు
పండుకొని, యంత తెలతెల్లవాఱ లేచి,
పాడుచుండెను 'శివ రామ బ్రహ్మ' యనుచు.

ఆతని పలుకులు ములుకులై యాత్మ నాఁట,
వెష్ణవుఁడు దిగ్గురని లేచి, భార్య లేపి,
నెత్తి నోరును లబలబ మొత్తుకొనుచు
దాని కిట్లనె పెదవులు తడఁబడంగ:

"ఏమె లేలెమ్ము - వింటివే యింటిదాన:.
వైదికుని కాఱుకూఁతలు ? పండుకొనఁగ
చోటు నిచ్చితి మన్న మోమోట లేక
వదరుచున్నాఁడు నోరికి వచ్చినట్లు."

తత్తరంబున మేల్కాంచి తరుణి యంత
“నాథ ! వైదికుఁ డేమి యొనర్చె ?" ననుచు
నడుగ, “మనవాని నిరువుర నడుమ నొక్కి
నులిమి చంపుచునున్నాఁడు చలము మీఱ.”

15