పుట:మధుర గీతికలు.pdf/266

ఈ పుట ఆమోదించబడ్డది

ఊసర వెల్లి


పాంథు లిరువురు దారిలో పాదపంబు
నీడఁ గూర్చుండి ముచ్చటలాడుచుండి;
రంత నెచ్చటనుండియో యరుగుదెంచి
వృక్ష మెగఁబ్రాఁకె నూసరవెల్లి యొకటి.

"చూచితే సఖ ! ఎంతటి చోద్య మొక్కొ!
వింతగా నిప్పు డెద్దియో జంతు వొకటి
సరగుసరగున నరుదెంచి తరువు నెక్కె,
దానిఁ బోలిన జంతువు ధరణిఁ గలదె ?

"బాపురే ! దానిరూపంబు బల్లిరూపు,
మోము చేపది, నాలుక పామునాల్క,
మేఘమును బోలె నీలంబు మేనిచాయ”
అనుచు నొక్కఁడు రెండవయతని కనియె.

9