పుట:మధుర గీతికలు.pdf/263

ఈ పుట ఆమోదించబడ్డది


అనుచు ప్రార్థించి కన్గవ నట్టె విచ్చి
చూచినంతనె, యాచెంత చోద్య మొప్ప
ఆముదపు మొక్క యొక్కటి యవతరించె;
ప్రీతితో దాని నాతండు పాతి పెట్టె.

'ముదము మీఱఁగ నాచిన్ని మొలక యెదిగి
రెమ్మలును కొమ్మలును గల్గి వృద్ధి జెందఁ
గాంచు టెన్నఁడొ కన్నులకఱవు దీఱ ?'
అనుచు మనమునఁ దలపోసి యతివరుండు.

"కోరినంతన నాకోర్కి కొనలుసాఁగ
మొక్క నిచ్చితి, వయ్యది మోసు లెత్తి
పెంపు జెందంగ వాన రప్పింపు మయ్య !
భక్తవత్సల !” అని వేఁడె భావమందు.

కారుమబ్బులు చదలిపై కడలుకొనియె,
చిమ్మచీఁకటి జగ మెల్లఁ గ్రమ్ముకొనియె,
బోరుబోరునఁ దోరంపుధార లడర
కుంభవృష్టిగ వర్షంబు కురియఁ జొచ్చె.