పుట:మధుర గీతికలు.pdf/262

ఈ పుట ఆమోదించబడ్డది

ఆముదపు చెట్టు


దారుణాటవిలో నొక్క తబిసిఱేఁడు
తనదుగుహయందు కూర్చుండి కనుల మోడ్చి
ఘోరతపమును గావించె; కొన్నినాళ్ల
కతని కీశుండు ప్రత్యక్ష మయ్యె నెదుట.

“వత్స ! నీ కేమి వలయునో వరము వేఁడు"
మనుచు దేవుండు కృపతోడ నానతిచ్చె;
కనుల నానందబాష్పముల్‌ క్రమ్ముకొనఁగ
అనియె నీరీతి నీశుతో మునివరుండు.

"విమలభక్తిని నిన్ను సేవించుకంటె
వలయునే యొండు? నిను పూజ సలుపుపొంటె
వరద ? దివ్వెకు చమురు కావలయుఁ గాన,
ఆముదపుచెట్టు దయచేయు మయ్య నాకు."

5