పుట:మధుర గీతికలు.pdf/260

ఈ పుట ఆమోదించబడ్డది

శత్రు మిత్రులు


చెవికి నిం పగు పలుకులచే హితుండు,
పరుషనిష్టురవాక్కలాపముల వైరి
తనదుచేతల నారసి తప్పు దిద్దు;
మిత్ర శాత్రవభేదంబు ధాత్రిఁ గలదె?

ఎక్కసక్కెపుమాటల నెత్తిపొడిచి
తాను చేసిన దుష్టకృత్యములఁ దెగడు;
శత్రుఁ డెన్నఁగ శత్రువేషమున నున్న
మిత్రుఁడే కాని, కేవలశత్రు వగునె ?

తనదుదోసంబు లారయు, తప్పు లెన్ను,
ఎగ్గులను జాటు, పాపంబు లుగ్గడించు,
దుర్నయంబులు వెలివుచ్చు, దొసఁగు లెంచు;
శాత్రవునికంటె నాప్తుండు జగతిఁ గలఁడె ?