పుట:మధుర గీతికలు.pdf/259

ఈ పుట ఆమోదించబడ్డది


భానుబింబము రాట్న, మభ్రంబు దూది,
చదలు మగ్గము, సంజ కెంజాయ రంగు,
కిరణములు నూలిపోఁగులై వఱలుచుండ,
సమయ మను సాలె కాంతివస్త్రంబు నేసె.

కటికిచీఁకటి పేరిటి కారుమొసలి
ఉప్పరం బను గజరాజు నొడిసిపట్ట,
సమయవిష్ణుఁడు వైచిన చక్ర మనఁగ
భానుబింబము దేదీప్యమాన మయ్యె.

సవితృఁ డను బంతి నమయేంద్రజాలికుండు
అస్తగిరి యను చిప్పచే నణఁచిపట్టి,
అందు లే, డిందు చూపెద నన్నకరణి,
ఉదయగిరిచక్కి చూపట్టె నుష్ణకరుఁడు.

సాంధ్యరాగాగ్నిహోత్రంబు సాక్షి‌ గాఁగ
ఇనుఁడు పద్మినిని కరగ్రహణ మొనర్చి
కుత్తుకను నల్లపూసల కుత్తికంటు
కట్టె నన, తేంట్లు తమ్మిపైఁ జుట్టుకొనియె.