పుట:మధుర గీతికలు.pdf/254

ఈ పుట ఆమోదించబడ్డది


నాలిపయ్యెదగాలికి నాట్యమాడు
చెఱువుతరగల మేలంబు సేయుపగిది,
శిరము లూపుచు నృత్యంబు చేయుచుండె
బంతిపువ్వుల గుత్తులు సంతసమున,

నుమముగుత్తుల కనులారఁ జూచి చూచి
సంతసంబున పారవశ్యంబు నొంది
చిత్తరువు వోలె నంతనె చేష్ట లుడిగి
నిట్టనిలువున మ్రాన్పడి నిలిచియుంటి.

చలువతెమ్మెర గమగమల్‌, కొలని యలల
గలగలలు, సంజకెంజాయ మిలమిలలును,
బంతిపువ్వుల నిగనిగల్‌ స్వాంత మెల్ల
నొక్క పెట్టున నుఱ్ఱూత లూగఁ జేసె.

సెజ్జపైఁ జేరి పలుమాఱు చింతఁగూరి
తోచ కేమియు నటు నిటు చూచునపుడు,
నాటి దృశ్యము మదిలోన నాటి నాటి
కుతుకమున నోలలాడుదు వెతల మఱచి.