పుట:మధుర గీతికలు.pdf/253

ఈ పుట ఆమోదించబడ్డది

బంతిపూలు


గగనతలమున నల్లాడు మొగులు రీతి
ఒంటిమై నేను విపినంబువెంటఁ దిరుగ,
దరిని గాంచితి తండోపతండములుగ
బంతిపువ్వుల కన్నుల పండువుగను.

మొలకసంజల పసిమికి ప్రోదివెట్టు
మేల్మిబంగరు రంగుల మిసిమితోడ
చెఱువుచుట్టును గట్టుపై తరులనీడ
బంతు లలరారె మరుచేతి బంతు లనగ.

నింగిపైఁ దోఁచు నాకాశగంగదరిని
తళుకు తళుకున మెరసెడు తారలట్లు.
కొలని పొడుగున మిఱుమిట్లు గొలుపుచుండె
వింతకాంతుల దీపించి బంతిపూలు.