పుట:మధుర గీతికలు.pdf/251

ఈ పుట ఆమోదించబడ్డది


చేతమున నించు కేనియు భీతి గొనక
ప్రభునితో మౌనివర్యుఁడు బదులు వలికె;
“ఎవరి పూజింతు నచ్చట? ఈశ్వరుండు
అవలఁ జనె - నీదు దేవాలయంబు వీడి.”

“లచ్చలకొలంది రూప్యముల్‌ వెచ్చపఱిచి
మేటిశిల్పంబు మెఱయ నిర్మించినట్టి
పైఁడి శిఖరంబు దేవుండు వీడి చనునె?
అక్కటా! ఎట్లు నమ్ముదు?" ననియె రాజు.

అనుడు మునివర్యుఁ డి ట్లనె “అవనినాథ!
కుడువ కూడును, పడియుండ గుడిసె లేక
గొల్లు మని నాఁడు ప్రజ లెల్ల గోల వెట్ట
గెంటితివి కాదె వారి నీ యింటినుండి ?

తనదు బిడ్డలు తలదాఁచికొనఁగ నింత
నీడ యైనను లేక యల్లాడుచుండ,
కనకభవనంబు నా కేల? యనుచు మదిని
కినిసి దేవుండు గుడి వీడి చనియె నధిప!"