పుట:మధుర గీతికలు.pdf/247

ఈ పుట ఆమోదించబడ్డది


ఉల్లమున నీసు రోసంబు మల్లడింప
మొగము బిగియించి కనుబొమల్‌ ముడివడంగ
శీఘ్రముగ విల్లు నమ్ములు చేతఁ దాల్చి
నిబ్బరంబుగ విలియము నిలిచియుండె.

చలన మొందక, కొంకును జంకు లేక
నిర్భయంబున ని ట్లనె నర్భకుండు :
'ఏయుమా తండ్రి! తడసెద వేల యింక?
బన్న మొందెనె నీ గుఱి యెన్నఁడేని!'

తనయు తెగువకు మది మెచ్చి జనకుఁ డంత
'ఈశ్వరుఁడు నీకు శుభముల నిచ్చుఁ గాత!'
అంచు, శరమును వింట సంధించి యేసె
రివ్వురివ్వున గాలిలో రెచ్చి పాఱ.

'బాపురే! ఎంత చక్కని నైపుణంబొ!
చెక్కుచెదరక యున్నాఁడు చిన్ని బిడ్డ
దేవుఁ డెన్నఁడు దీనులదెసనె నిలుచు'
అనుచు గొల్లున నఱచిరి జనులు చెలఁగి.