పుట:మధుర గీతికలు.pdf/246

ఈ పుట ఆమోదించబడ్డది


'నేర మేదేని నున్నచో, నేనె కాని,
పాప మీతఁడు పసిపాప, బాధ్యుఁడగునె?
కురియఁ దగుఁ గాని నామీఁద క్రోధవహ్ని,
చిన్ని బాలుని శిక్షింపఁ జన్నె మీకు?'

వికటముగ నవ్వి తోడనే విభుఁడు పలికె :
“చెనఁటినే చిన్నిబాలుని శిక్షసేయ?
వీని తలనుండి యొక రక్తబిందు వైన
ధరణిఁ బడెనేని, కర్తవు దాని కీవె.

పెక్కు లేటికి! - నీ విల్లు నెక్కు వెట్టి
సూటిగా నొక్క బాణంబు మీటు మయ్య
రేఁగుకాయను లక్ష్యమ్ము గాఁగఁ జేసి,
కై కొనుము స్వేచ్చ కాన్కగా కమ్మతీఁడ:”

పిడుగు బోలిన యా మాట వినినతోనె
జనుల హాహారవంబులు చదలు ముట్టె,
సతుల యాక్రందనంబులు సందడించె,
పిల్ల లెల్లరు భీతిచే తల్లడిలిరి.