పుట:మధుర గీతికలు.pdf/245

ఈ పుట ఆమోదించబడ్డది


'పట్టి బంధింపుఁడీ వీని బంటులార!'
కనుల నిప్పులు రాలంగ ననియె ఱేఁడు-
'తెగువతో వీఁడు నా యాన ధిక్కరించె,
ద్రోహి యగు వీని శిరమును ద్రుంతు నిపుడె.'

క్షణము తాళుఁడు - మా కొండు జ్ఞప్తివచ్చె-
మేలివిలుకాండ్రలో వీఁడు మేటి యనుచు
వింటి మొకసారి, యీతని వింటినేర్పు
కని వినోదింత మొక్కింత, గడియ సేపు.

చిట్టిబాలుని గొని తెండు రెట్టఁబట్టి,
వృక్షమూలమునకు వాని విఱిచికట్టి
నిలుపుఁడీ రేఁగుకాయను నెత్తిమీఁద'
అనుచు శాసించె ఱేఁడు కట్టలుక గదుర.

ఆనతిచ్చెనొ లేదొ యిట్లవనివిభుఁడు
భటు లొనర్చిరి సర్వంబు చిటికలోన;
ప్రభునిచేఁతకు వగజెంది పలికె కాఁపు
గద్గదిక తొట్రుపాటును కడలుకొనఁగ.