పుట:మధుర గీతికలు.pdf/244

ఈ పుట ఆమోదించబడ్డది


'ధ్వజమునకు భక్తి మ్రొక్కుఁడీ దస్యులార!'
అనుచు గొంతెత్తి యఱచిరి యతని భటులు;
చిత్తరువు వోలె నడుమున చేయి జేర్చి
ఠీవి మీఱఁగ కూర్చుండె భూవరుండు.

జనులగుంపును జూచి, ధ్వజంబు జూచి,
పొగరుబో తగు నా ఱేని మొగము జూచి,
మది నొకింతయు నదరును బెదురు లేక
నిట్టతాడివిధంబున నిలిచె కాఁపు.

అతని సాహసమును గాంచి యక్కజంబు
నంది, భటు లిట్లు గద్దించి రతనిఁ గదిసి:
'కనులు గానవ? నీ కింత కావరంబ!
మ్రొక్క వేటికి సాఁగిలి టెక్కెమునకు!'

అనుడు, ధీరత తోఁపంగ ననియె కాఁపు:
'ఈశునకె కాని, మనుజున కేను మ్రొక్క;
తుచ్చజీవము తొలఁగిన తొలఁగుఁ గాక,
విడువఁ జాలను స్వాతంత్ర్య విమలవాంఛ.'