పుట:మధుర గీతికలు.pdf/243

ఈ పుట ఆమోదించబడ్డది


ఆతఁ డొకనాఁడు రాజ్యమదాంధకార
మడర, స్విజ్జరులాండున కరిగి, యందు
విలియ మున్నపురంబున విడిసి, తనదు
టెక్కెమును నాటుకొల్పి, చాటించె నిట్లు:

'వినుఁడి, ఎవఁడైన నీ వీథి వెంటఁ జనుచు
టెక్కెమును గాంచి తలవంచి మ్రొక్కఁడేని
తోడనే వాని మూర్థంబు తునిసిపడును
మందులార! యో బానిసపందలార!'

విలియ మానాఁటిప్రొద్దున పొలము వీడి
సుతునిఁ దోడ్కొని నగరంబు జొచ్చి చనుచు,
దారిలోఁ గాంచె ధ్వజమును, దానిచుట్టు
సంభ్రమంబున మూఁగిన జనులగుంపు.

చౌకులో నొక్క యున్నత స్థలమునందు
ధ్వజము నెలకొనియుండెను, దాని దిగువ
విచ్చుకత్తులు కరముల వీఁగియాడ
భటులు బారులు దీర్చిరి ప్రభునిచుట్టు.