పుట:మధుర గీతికలు.pdf/242

ఈ పుట ఆమోదించబడ్డది


గొఱ్ఱెపిల్లలతో వాఁడు కూడిమాడి
వేడుకలు మీఱ నెప్పుడు నాడుచుండు;
చంగు మని యవి చేలలో చౌకళింప
చెలఁగి తానును వానితో చెంగలించు.

కూడు గుడ్డకు నొక్కింత కొఱఁత లేక
దేవుఁ డిచ్చినదానికి తృప్తి నొంది
వెత లెఱుంగక హాయిగా స్వేచ్ఛ మీఱ
గడపుచుండిరి వారలు కాల మెల్ల.

కాల మొకరీతి క్రమముగాఁ గడవఁబోదు-
సౌఖ్యముల వెంట దుఃఖముల్‌ సంభవించు;
చల్ల నై నట్టి యామని చన్నపిదప
మండువేసఁగి యెండలు మసలుఁ గాదె?

ప్రకృతిరమణీయ మగు స్విజ ర్లాండుసీమ
పడయలే దింక స్వాతంత్ర్య భానురేఖ;
వైరి యగు నాస్ట్రియాదేశ క్రూరవిభుని
పాలనంబున కృశియించి డీలువడియె.