పుట:మధుర గీతికలు.pdf/238

ఈ పుట ఆమోదించబడ్డది


చేయ నగుఁ గాని, యీరీతి చేవ దఱిగి
పాఱిపోవుట మీ కది పౌరుషంబె?
నిక్కముగ మీర లాంధ్రులై నెగడి రేని,
చోడవీరుల కీర్తులు వాడకుండ
ఆహవంబున రిపులతో మోహరించి
మించి పోరుఁడు, జయలక్ష్మి మిము వరించు"
అంచుఁ జెదరిన చోడ సైన్యంబులకును
నూతనోత్సాహశక్తిని నూలుకొలిపి
మరల నాజికి వారి నెల్లర మరల్చి
ఒక్క పెట్టున రిపులవై నుఱికి తఱిమి
చించి చెండాడి శాత్రవసేన లెల్ల,
వసుమతీశుని విడిపించె వైభవమున.
తల్లి: నీ సుతు సాహసధైర్యములకు
అంత మన నృపుఁ డెంతయు స్వాంతమందు
పొంగి, యాతని గ్రుచ్చి కవుంగిలించి
కంఠహారంబు ఖడ్గంబు కాన్క నొసఁగి
వానిఁ దనసేనలకు దళవాయి చేసె.
జనము లెల్లరు జయజయధ్వను లెసంగ
వినుతి చేసిరి నీ సుతు విమలకీర్తి,
అంగనలు పాడి రంతట మంగళములు.

57