పుట:మధుర గీతికలు.pdf/229

ఈ పుట ఆమోదించబడ్డది


ధనికుఁ డొక్కదినంబున తానమాడ
చెఱువునకుఁ బోవ, వానితో నరిగి యతఁడు
కొలనిలో దిగి స్నానంబు సలుపుచుండ,
గట్టుపైఁ దాను కూర్చుండె కవివరుండు.

మోము ముంచిన, దేహంబు తోముకొన్న,
పుక్కిట నతండు నీరంబు పుక్కిలించి
యుమ్మివై చిన, చీఁదిన, తుమ్మిన, కవి
'బళిర! సేబాషు! భే!' షని పలుకుచుండె.

కాలవశమున ధనికుని కాలు జాఱి
దిగ్గు రని వాఁడు నీటిలో మొగ్గవైవ,
ఈఁతలో నది యొక వింతరీతి యగుట
'బళిర ! నీదు నే' ర్పని కవి ప్రస్తుతించె.

ఈఁత నేర్వనివాఁ డౌట, లోతునీళ్ళఁ
బడి పెనంగుచు, తబ్బిబ్బువడుచు, కాళ్లు.
తాఱుమాఱుగ విలవిలఁ దన్నికొనుచు,
అంత ధనికుండు కొట్టుమిట్టాడుచుండె.

48