పుట:మధుర గీతికలు.pdf/227

ఈ పుట ఆమోదించబడ్డది


దానిఁ గనినంతనే నక్క తమక మెదను
బట్టఁజాలక, నీతులఁ గట్టిపెట్టి,
చంగు మని యొక్క పెట్టున చౌకళించి
పుంజు పైఁబడి దానిని నంజుకొనియె.

ఎలుక యొక్కటి యాచెంత కలుఁగునుండి
వెలుపలికి వచ్చి మెల్లన వెడలుచుండె;
దాని గనినంత నోరూర, తోనే పిల్లి
ఒక్కగంతున దానిపై కుఱికి చంపె.

బల్లి యొక్కటి యీ దృశ్య మెల్లఁ గాంచి
'ఇస్సి? జగమెల్ల పాపభూయిష్ట' మంచు
గుటుకు మని యొక్క దోమను గుటక వైచి
రివ్వునం జనె 'హా! శ్రీహరీ!' యటంచు.

46