పుట:మధుర గీతికలు.pdf/220

ఈ పుట ఆమోదించబడ్డది


ఆతఁ డవి యెల్ల కడుపార నారగించి
ఇట్లు వచియించె, “సాధ్వి! నే నింటనుండి
అరుగునప్పుడు చిల్లిగవ్వైన లేదు,
ఇన్ని కూరలు భక్ష్యంబు లెట్లు వచ్చె?

ఇందు తక్కిన వన్నిటి కేమిగాని-
ఇట్టి పెరుఁగును చవిచూచి యెన్నఁ డెఱుఁగ,
ఎట్టు లభియించె నీ కిట్టి గట్టి పెరుఁగు?
గేదెపెయ్యయు మనయింట లేదు గాదె!

అనుడు, నవ్వుచు నా యింతి యనియె నిట్లు;
“గట్టిపెరుఁ గన్న మీ కెంతొ కాంక్ష యంచు
కొంటి నొక గేదె మన పొరుగింట నున్న
కంసలికి గుల్ల గుట్ర తాకట్టు వెట్టి.”

ఎచట కొంటివి? మనయింటి కెదుటనున్న
యట్టి కంసాలిచెంతనా? అమ్మచెల్ల:
నిక్కమగు గేదె కా దది లక్కగేదె
సుమ్ము, కంసాలి యకట? మోసమ్ముచేసె.”

39