పుట:మధుర గీతికలు.pdf/218

ఈ పుట ఆమోదించబడ్డది


“కొలనిలోని నీరు గ్రోలంగ నేగితి
వీనిచెంత మేఁకపిల్ల నునిచి,
మగుడి వచ్చినంత మటుమాయ మొనరించె;
చూడు మెంత మోసగాఁడొ వీఁడు.'

“కొలనిచెంత నేను కూర్చుండ, నీతండు .
కుంటిమేఁక నొకటి వెంటఁదెచ్చె;
మఱకకాలు నేను విఱుగఁగొట్టితి నంట
ఔర! ఎంత మాయదారి వీఁడు!”

అనుచు నిరువు రిట్లు తనతోడ మొఱ వెట్ట
బ్రాహ్మణుండు తాను బధిరుఁ డగుట,
తెలియలేక వారి పలుకుల నించుక
బదులు వలికె నిట్లు వారితోడ.

“ఏల మీర లిట్లు గోలపెట్టెద రయ్య?
బ్రహ్మ వచ్చి పట్టు పట్టెనేని,
కాపురంబు సేయ నా పాడుముండతో
ఒడలిలోనఁ బ్రాణ మున్నదాఁక.”

37