పుట:మధుర గీతికలు.pdf/211

ఈ పుట ఆమోదించబడ్డది


రేపు మా పని జరుపుచు త్రిప్పు నొకఁడు,
అన్న ! ఇటు సేయు మటు సేయు మను నొకండు
ఉస్సు రని వేడినిట్టూర్పు నూర్చు నొకఁడు,
కాని తోడ్పడువాఁ డెందు కానరాఁడు.

త్రిమ్మరిల్లుచు నిల్లిల్లు సొమ్మసిల్లి,
ఇట్లు తలపోసికొంటి నా హృదయమందు;
“పరులసాయ మపేక్షించి బ్రతుకు టరయ
ఎండమావుల జల మాన నెంచినట్లు.

వలదు, నా కేల యింకను వారిజోలి?
కలఁడు నా కొక్క కూరిమి చెలిమికాఁడు,
అండ నెప్పుడు బాయక యుండువాఁడు;
ఆశ్రయించెద వానినె యనవరతము.

కుడువ, కట్టఁగ, వస్తువుల్‌ ముడిచిపట్ట,
చదువ, వ్రాయఁగ, కార్యముల్‌ చక్కఁబెట్ట
సంతతంబును తో డయి సాఁకుచుండు
నాదు మేలైన కుడిచెయ్యె నాకు దిక్కు.”

30