పుట:మధుర గీతికలు.pdf/209

ఈ పుట ఆమోదించబడ్డది


చిఱునగవు నెమ్మొగమ్మున చెంగళింవ
'తలుపు తెఱుఁ' డని మెల్లగ పలికె ఱేఁడు;
పెదవి దాఁటెనొ లేదో భూవిభుని పలుకు
పరుగువాఱి కవాటమ్ము తెఱిచె భటుఁడు.

జమ్ము జుమ్మని చంచరీకమ్ము లెగసి
రభసమున నా సభామందిరమ్ము జొచ్చి
జాణ యగు రాణివామహస్తమున నున్న
కుసుమమంజరి‌ చుట్టును ముసరికొనియె.

అదియె నిక్కపుపూగుత్తి యనుచుఁ దోప
సార్వభౌముఁడు మందహాసమ్ము చేసె;
ప్రజల ముసిముసినగవులు గుజగుజలును
ఒక్క పెట్టున కొలు వెల్ల పిక్కటిల్లె.

అచ్చెరువు ఱిచ్చపాటును పిచ్చలింప
శిరము ముందుకు వంచి యా షీబరాణి
పుడమియేలిక మ్రోలను మోఁకఱిల్లి
వేయినోళుల వినుతించె విభునిప్రజ్ఞ.

28