పుట:మధుర గీతికలు.pdf/208

ఈ పుట ఆమోదించబడ్డది


'ఏది సహజంబొ, యిం దేది కృత్రిమంబొ?
నుడువుఁడీ' యని ధరణీశు నడిగె రాణి;
పువ్వుగుత్తులవంక కీల్బొమ్మ వోలె
తేఱి చూచుచు నృపుఁ డట్టె యూరకుండె.

సభ్యు లెల్లరు తల లూఁచి సంభ్రమమున
ముక్కుపై వ్రేలి నిడికొని గ్రుక్కుమిక్కు
రనక యుండిరి; క్రమ్మఱ నడిగె రాణి
యధిపుమౌనంబు పొడఁగని యాత్మ నలరి.

'ఏది సహజంబొ, ఎయ్యది కృత్రిమంబొ?
అరసి వేగమె దేవర యానతిండు;
అఖిలశాస్త్రవిశారదులైన మీకు
ఎఱుఁగరానట్టి మర్మముల్‌ ధరణిఁ గలవె?'

ఏమియును మాఱు పలుకగ భూమివిభుఁడు
దేనికో వేచియున్నట్లు దెసలు చూచె;
వినఁబడియె నంత గద్దియవెనుక నున్న
ద్వారమవతల భ్రమరఝంకారరవము.

23